రాజవీధి రహదారి సమస్యపై పట్టించుకోని అధికారులు – కలిదిండి గ్రామస్తుల ఆవేదన
ఏలూరు, కలిదిండి:
ఏలూరు జిల్లా కలిదిండి మండల కేంద్రానికి చెందిన పల్లపాటి కృష్ణమూర్తి తమ గ్రామంలోని రాజవీధి రహదారి సమస్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి సమస్యను పరిష్కరించాలంటూ పి.జి.ఆర్.ఎస్ ద్వారా పదిసార్లకు పైగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని ఆయన తెలిపారు.
ఈ విషయమై ఏలూరు, RSR, ప్రతినిధితో మాట్లాడుతూ, రాజవీధి రహదారి నిర్మాణంలో జరుగుతున్న అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, సమస్యను పక్కదోవ పట్టిస్తూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కృష్ణమూర్తి ఆరోపించారు.
రాజవీధి రహదారి దుస్థితిపై ఫిర్యాదు చేసిన విషయం గ్రామస్తులకు తెలిసినప్పటికీ, సంబంధిత అధికారులు స్పందించకపోవడం వల్ల గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి సరిగా లేకపోవడంతో నిత్యం రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోందని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని గ్రామస్తులు వాపోయారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి, రాజవీధి రహదారి నిర్మాణంలో గ్రామస్తులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని పల్లపాటి కృష్ణమూర్తితో పాటు గ్రామస్తులు కోరుతున్నారు.




