RSR NEWS
అమరావతి నిర్మాణానికి మేము సైతం అంటూ ముందుకొచ్చిన ఆర్యవైశ్యులు
ముదినేపల్లి (ఏలూరు జిల్లా):
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తమవంతు బాధ్యతగా సహకారం అందించాలనే సంకల్పంతో ముదినేపల్లి మండలంలోని ఆర్యవైశ్యులు ముందడుగు వేశారు. “అమరావతి నిర్మాణానికి మేము సైతం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందనను పొందింది.
ముదినేపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవస్థానం ప్రాంగణంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మరియు ఎన్‌డీఏ నాయకులను పాదాలు కడిగి ఘనంగా సత్కరించిన ముదినేపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోజ్ సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, ఆర్యవైశ్యులు “116 రూపాయలతో అమరావతికి సాయం చేద్దాం” అనే కాన్సెప్ట్‌లో భాగంగా తొలి విడతగా వందమంది వ్యక్తులు ఒక్కొక్కరు 116 రూపాయలు చొప్పున అమరావతి నిర్మాణానికి క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు చెల్లించారు. అదేవిధంగా వచ్చే రెండు రోజులలో మరో వందమంది ఇదే విధంగా అమరావతి నిర్మాణానికి తమ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ డాక్టర్ మనోజ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చిన్న మొత్తంలోనైనా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకరిస్తే అమరావతి నిర్మాణం మరింత వేగంగా సాగుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు అందరూ అమరావతి నిర్మాణానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రిగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ, అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సామర్థ్యానికి తగ్గట్టుగా సహకారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ముదినేపల్లి ఆర్యవైశ్యులు చూపిన చొరవ ఇతర ప్రాంతాలకు కూడా ప్రేరణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.





