RSR NEWS
ఘంటసాల గారి జీవితం అందరికీ ఆదర్శం – చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
చింతలపూడి,
గానగంధర్వుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవితం సమాజానికి ఆదర్శప్రాయమని, ఆయన పాడిన పాటలు ఈనాటికీ ఆణిముత్యాల్లా నిలిచాయని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అన్నారు.
చింతలపూడి పట్టణంలోని రత్న కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వేగి లింగేశ్వర స్వామి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహాన్ని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు.
విగ్రహ దాత శిలాఫలక ఆవిష్కరణ
విగ్రహ ఆవిష్కరణ అనంతరం విగ్రహ దాత శ్రీ మారుమూడి తామస్ గారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చింతలపూడి పట్టణం, మండల స్థాయిలోని అఖిలపక్ష నాయకులు పాల్గొని ఘంటసాల గారి సేవలను కొనియాడారు.
ఎమ్మెల్యే రోషన్ కుమార్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సుమారు పదివేలకుపైగా పాటలు పాడిన మహానుభావుడని, ఆయన కేవలం గాయకుడే కాకుండా స్వతంత్ర సమరయోధుడని తెలిపారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలలు జైలు శిక్ష అనుభవించారని, ఎంతో చిన్న కుటుంబ నేపథ్యం నుంచి కష్టపడి పై స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ఘంటసాల గారి కృషి మర్చిపోలేనిదని అన్నారు.
అలాగే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజ నటులకు తనదైన శైలిలో అద్భుతమైన పాటలు పాడి చిరస్థాయిగా నిలిచారని చెప్పారు.
చింతలపూడి పట్టణంలో ట్యాంక్ బండ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్‌లో భాగంగా, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా విగ్రహాలన్నింటిని అందరి సహకారంతో ఒకే చోట ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.
జూనియర్ ఘంటసాల పాటలతో అలరింపు
కార్యక్రమం మధ్యలో జూనియర్ ఘంటసాల ఆచారి, ఘంటసాల గారి అమృతగానాలను ఆలపించి ప్రేక్షకులను విశేషంగా అలరించారు.
ఎమ్మెల్యే శ్రీ సొంగా రోషన్ కుమార్ దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, ఘంటసాల అభిమానులు, యువత, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




