Ticker

6/recent/ticker-posts

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన జిల్లాలో పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా స్థాయి కార్యక్రమ అధికార్లు మరియు పారిశుధ్య విభాగ సిబ్బందితో సమగ్ర సమీక్ష సమావేశం




 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao  9949291526

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో సమగ్ర సమీక్ష సమావేశం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన జిల్లాలో పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా స్థాయి కార్యక్రమ అధికార్లు మరియు పారిశుధ్య విభాగ సిబ్బందితో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన జిల్లా పంచాయతీ అధికారులు హాజరు కాకపోవడంపై చైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైన పారిశుధ్య, పరిశుభ్రత అంశాలపై నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి బాధ్యతాయుతంగా హాజరు కావాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేస్తూ, అధికారులంతా తమ విధి బాధ్యతల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టాల్సిన పారిశుధ్య కార్యక్రమాలు మరియు చెత్త ప్రాసెసింగ్ పనులకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక నివేదిక ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమావేశంలో తెలిపారు. ఈ ప్రణాళిక ఆధారంగా పనులను వేగవంతంగా ప్రారంభించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పద్మశ్రీ ప్రసాద్ చైర్‌పర్సన్ ఆదేశించారు.

ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని మూడు జిల్లాలకు చెందిన వివిధ గ్రామాలలో పారిశుధ్య రంగంలో ఉన్న లోపాలు, చెత్త డంపింగ్ సమస్యలు, అక్రమ వ్యర్థాల నిల్వలు, పరిశుభ్రత లోపాలను స్పష్టంగా చూపించే వీడియోలను ప్రదర్శించారు. ఈ వీడియోలను వీక్షించిన అనంతరం సంబంధిత అధికారులు పరిస్థితి తీవ్రతను గుర్తించి, వెంటనే తగిన చర్యలు చేపట్టి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని చైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పద్మశ్రీ ప్రసాద్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ గ్రామాలలో పరిశుభ్రత కాపాడడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో సాధ్యమయ్యే అత్యంత కీలక కార్యక్రమమని పేర్కొన్నారు. చెత్తను మూల స్థాయిలోనే వేరు చేసి సేకరించడం, తడి చెత్త – ఎండు చెత్తను వేర్వేరుగా ప్రాసెస్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు.

ప్రధాన రహదారుల పక్కన, గ్రామాల చివర ప్రాంతాలలో అనధికారికంగా చెత్తను డంపింగ్ చేయడం వల్ల దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేస్తూ, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టి పూర్తి స్థాయిలో పరిశుభ్రత సాధించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే ప్రతి గ్రామంలో చెత్త ప్రాసెసింగ్ కేంద్రాల షెడ్డులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి చెత్త ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం కన్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి మండలం, ప్రతి గ్రామానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిర్దిష్ట కాలవ్యవధిలో లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు.

గ్రామ స్థాయిలో పారిశుధ్య కార్మికులకు అవసరమైన రక్షణ సామగ్రి, పనిముట్లు, వాహనాల లభ్యత ఉండేలా చూడాలని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చైర్‌పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఎం. శ్రీహరి, ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ, జిల్లా స్థాయి కార్యక్రమ అధికారులు, పారిశుధ్య విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.