శ్రీ రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ వారి ఆశీస్సులతో పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మండపార్చన, కుంకుమార్చన కార్యక్రమాలు భక్తుల సమక్షంలో నిర్వహించబడినవి.
ఉండవల్లి అపార్ట్మెంట్స్ అధినేత ఉండవల్లి రాము, సుజాత దంపతులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పుష్పయాగోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ఎస్పీ నక్క సూర్యచంద్రరావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఉండవల్లి అపార్ట్మెంట్స్ అధినేత ఉండవల్లి రాము మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా తమ కుటుంబం అమ్మవారి కరుణాకటాక్షంతో ఈ ఉత్సవాలను నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తూ పుష్పయాగ మహోత్సవాన్ని ప్రత్యేకంగా చేపట్టినట్లు తెలిపారు.
అదే విధంగా రాత్రి 9 గంటలకు నవజ్యోతి కళామందిర్, గోపన్నపాలెం కళాకారులు రావణబ్రహ్మ, దుర్యోధనుడు, మాయల పకీర్ వంటి పాత్రలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం ‘పూలరంగడు’ సాంఘిక నాటకం ప్రదర్శించి వినోదాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఆలయ ఈవో ఎన్. సతీష్ కుమార్, ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.






