Ticker

6/recent/ticker-posts

రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మార్చి 4న విజయవాడలో నిర్వహించనున్న “చలో విజయవాడ”





 వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ‘చలో విజయవాడ’
మార్చి 4న భారీ ర్యాలీ – మంత్రుల సమక్షంలో జర్నలిస్టుల సభ
చలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరించిన ఏలూరు జిల్లా కమిటీ
ఏలూరు, :
రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మార్చి 4న విజయవాడలో నిర్వహించనున్న “చలో విజయవాడ” 

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఏలూరు జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సంఘ నాయకులు, సీనియర్ పాత్రికేయులు బాలశౌరి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సుమారు 11 ప్రధాన డిమాండ్ల సాధనకు దీర్ఘకాలంగా పోరాటం కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు సరైన పరిష్కారం లభించలేదన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహాల కేటాయింపు అంశం ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

జిల్లా అధ్యక్షుడు జబీర్, కార్యదర్శి హరీష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు హామీలు ఇచ్చే ప్రభుత్వాలు అమలు దశలో నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడం, ప్రమాద భీమా పథకాన్ని పునరుద్ధరించడం, ఇతర రాష్ట్రాల మాదిరిగా పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే మీడియా హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక 

మీడియా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు కార్పొరేట్ సంస్థల ద్వారా జర్నలిస్టులు మరియు వారి కుటుంబాలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి సహా పలువురు ప్రజాప్రతినిధులకు దశల వారీగా వినతిపత్రాలు అందజేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వ దృష్టికి జర్నలిస్టుల సమస్యలను తీసుకెళ్లేందుకు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మార్చి 4న విజయవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ర్యాలీ అనంతరం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న జర్నలిస్టుల సభకు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సభలో జర్నలిస్టుల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్, 

ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు నారాయణ, సీనియర్ నాయకులు మిల్టన్ ప్రతాప్, సత్యనారాయణ, సతీష్, దెందులూరు నియోజకవర్గ అధ్యక్షుడు రిషి, కార్యదర్శి వెంకట్రావు, ఏలూరు నియోజకవర్గ నాయకులు జయరాం, ప్రతాప్, దొరబాబు, మౌనిక, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.