ఏలూరు నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాలలో ఈరోజు 3వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్-19 ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్–2026 ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను అబ్రహం అండ్ గారీ కాస్పరోవ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అకాడమీ కోచ్ గంజి యోహాన్ మాట్లాడుతూ, చదరంగం క్రీడ విద్యార్థులలో మానసిక శక్తిని పెంచడమే కాకుండా, చురుకుదనం, ఏకాగ్రత మరియు విద్యలో ప్రతిభను మెరుగుపరుస్తుందని తెలిపారు. ఈ క్రీడ ద్వారా విద్యార్థులు మానసిక ఒత్తిడిని తగ్గించుకుని, ఉల్లాసభరితంగా చదువులో ముందుకు సాగగలరని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలలో సుమారు 112 మంది విద్యార్థులు పాల్గొనడం విశేషమని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి రూ.25,000 వరకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
స్వరూప రాణి మాట్లాడుతూ, సిద్ధార్థ అకాడమీ యాజమాన్యం ఇటువంటి క్రీడలకు విశేష ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలలో ఇంగ్లీష్, సైన్స్ వంటి సబ్జెక్టులతో పాటు చదరంగాన్ని ప్రత్యేక అంశంగా ప్రవేశపెట్టడం అభినందనీయమని అన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇటువంటి పోటీలు నిర్వహించడం వల్ల పిల్లల మేధస్సు, ఆలోచనా శక్తి పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్ నవీన్, ప్రేమ జ్యోతి, చెస్ అకాడమీ డైరెక్టర్ వై మహేష్, సింహాద్రి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




