చింతలపూడి నగరవనం అద్భుతంగా తీర్చిదిద్దాలి – ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
ఏలూరు,RSR,న్యూస్, srinivas,, ప్రతినిధి :
చింతలపూడిలో నూతనంగా నిర్మించనున్న నగరవనం అన్ని వర్గాల ప్రజలకు వినోదాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని అందించే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సలహాదారు, మాజీ చీఫ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ కే. మల్లికార్జున రావు గారిని కలిసి నగరవనం రూపకల్పన, అభివృద్ధి పనులు, అందులో ఏర్పాటు చేయవలసిన విభాగాలు మరియు ఇతర సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి నగరవనం మిగతా ప్రాంతాల కంటే భిన్నంగా ఉండాలని, కుటుంబ సమేతంగా సందర్శకులు ఆనందించేలా వినోదభరితంగా, ఆకర్షణీయంగా రూపొందించాలని సూచించారు. పిల్లలు, యువత, మహిళలు, వృద్ధులు సహా అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉండేలా పార్కులో ఆధునిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే ప్రకృతి వాతావరణాన్ని కాపాడుతూ పచ్చదనం పెంపొందించే విధంగా మొక్కలు, ఔషధ వనాలు, వాకింగ్ ట్రాకులు, పిల్లల ఆట స్థలాలు, ఓపెన్ జిమ్, నీటి వనరులు, ఫౌంటెన్లు, విశ్రాంతి మండపాలు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు వంటి సౌకర్యాలు ఉండేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.
ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక ఆకర్షణలు కల్పించాలని కూడా ఎమ్మెల్యే సూచించారు. సందర్శకుల అభిరుచులకు అనుగుణంగా నూతన హంగులతో నగరవనాన్ని అభివృద్ధి చేస్తే చింతలపూడి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మల్లికార్జున రావు మాట్లాడుతూ నగరవనం అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి పరిరక్షణతో పాటు ప్రజలకు వినోదాన్ని అందించేలా ఈ ప్రాజెక్టును ఆదర్శవంతంగా రూపొందించాలని సూచించారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆలోచన అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా ఫారెస్ట్ అధికారి సందీప్ రెడ్డి గారికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. చింతలపూడి నగరవనం అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


