RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
ఏలూరు నగరంలోని తూర్పువీధి గంగానమ్మ జాతర పూజల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు
దెందులూరు/ఏలూరు, జనవరి 22, 2026 :
శతాబ్దాలుగా ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న తూర్పువీధి శ్రీ గంగానమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ జాతరలో భాగంగా ఏలూరు తూర్పువీధిలోని జాతర కమిటీ కన్వీనర్ వంకినేని భాను ప్రకాష్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల ఘటాలకు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ సతీమణి సమేతంగా పాల్గొని అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ,
శతాబ్ద కాలం పైగా ఏలూరు ప్రజల ఆరాధ్య దైవంగా నిలిచిన తూర్పువీధి గంగానమ్మ జాతరను జాతర కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అమ్మవార్ల కరుణా కటాక్షాలు దెందులూరు నియోజకవర్గంతో పాటు ఏలూరు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ నెల 25వ తేదీన జరగనున్న మహాకుంభం, అలాగే 26వ తేదీన చిత్ర విచిత్ర వేషధారణలతో భారీ భక్తజన సందోహంతో నిర్వహించనున్న కొర్ల బండి ఊరేగింపు కార్యక్రమాలకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతర కమిటీ కన్వీనర్లు, వాలంటీర్లు మరియు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.





