Editor: Chintapalli Srinivasarao
కుంతలగూడెంలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల ప్రారంభం – గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన
కొయ్యలగూడెం (పోలవరం నియోజకవర్గం):
పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్, సీసీ డ్రెయిన్ పనులను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ , పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కుంతలగూడెం నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంతో గ్రామంలో పరిశుభ్రత పెరగడమే కాకుండా రాకపోకలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలన అందించవచ్చని అన్నారు.
ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుతూ, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో కుంతలగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ , తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పారెపల్లి రామారావు , జనసేన పార్టీ మండల అధ్యక్షులు తోట రవికుమార్ , గ్రామ సర్పంచ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





